: ఉపరాష్ట్రపతిపై మండిపడ్డ ఆర్ఎస్ఎస్
భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ మండిపడింది. ఉపరాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో ఉండి కూడా... హమీద్ అన్సారీ ఫక్తు మత నాయకుడిలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ఆలిండియా మజ్లిస్-ఏ-ముషావరత్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రసంగించిన అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గుర్తింపు, విద్యావకాశాలు తదితర అంశాల్లో ముస్లింలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని అన్సారీ అన్నారు. దీనిపై ఆర్ఎస్ఎస్ ధ్వజమెత్తింది. అన్సారీ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదని తన అధికారిక పత్రిక 'పాంచజన్య'లో పేర్కొంది. తమ అతివాద ధోరణితోనే ముస్లింలు సమస్యలు తెచ్చుకుంటున్నారనే విషయాన్ని అన్సారీ చెప్పలేకపోయారని విమర్శించింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు, భారత్ లోని ఇతర ముస్లిం సంస్థలు లౌకిక విధానానికి ఎలా తూట్లు పొడుస్తున్నాయో అన్సారీ తెలుసుకోవాలని సూచించింది. హజ్ యాత్రలకు ఆర్థిక సహాయం అందజేయడాన్ని కూడా ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది.