: సంపన్న రాజకుమారుడు... 'రియల్ టార్జాన్' ఇంకా బతికే ఉన్నాడు!
సంపన్న రాజకుమారుడు, ఒట్టి చేతులతో మొసళ్లు, అడవి పందులను చంపేసే 'రియల్ టార్జాన్' మైఖేల్ పీటర్ ఫోమెంకో (84) బతికే ఉన్నారు. నరవాసన వస్తే రెచ్చిపోయే మొసళ్లు రాజ్యమేలే రెయిన్ ఫారెస్ట్ లో 57 ఏళ్లు జీవించిన ఆయన ఇంకా బతికే ఉన్నారని మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది. రష్యా రాకుమారి ఎలిజబెత్ మకాబెల్లీ, ఛాంపియన్ అథ్లెట్ డేనియల్ ఫోమెంకో దంపతుల ఏకైక కుమారుడు మైఖేల్ పీటర్ ఫోమెంకో కుటుంబం జార్జియాలో ఉండేది. కమ్యూనిజం పెచ్చరిల్లుతున్న దశలో సంపన్న వర్గానికి చెందిన మైఖేల్ పీటర్ ఫోమెంకో కుటుంబం రష్యాలోని జార్జియాలో ఉండలేక జపాన్ వలస వెళ్లిపోయింది. 1937లో జపాన్, చైనా యుద్ధం ప్రారంభమైన తరువాత ఆ కుటుంబం ఆస్ట్రేలియా వలస వెళ్లిపోయింది. అయితే, వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఇవ్వకుండా శరాణార్థులుగా ఆశ్రయమిచ్చింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన మైఖేల్ చదువు, ఆటల్లో విశేషమైన ప్రతిభ కనబరిచాడు. దీంతో 1956లో సిడ్నీ ఒలింపిక్స్ ఎంపికకు వెళ్లి తృటిలో సెలక్షన్ నుంచి తప్పిపోయాడు. శరణార్థి జీవితం పట్ల విసుగు చెందిన మైఖేల్, రచయిత హోమర్ రాసిన గ్రీకు వీరుడు ఒడస్సీ కవిత్వం స్పూర్తితో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉత్తర ఆస్ట్రేలియాలోని ఇంగామ్, కేప్ యార్క్ మధ్యనున్న దట్టమైన రెయిన్ ఫారెస్ట్ లోకి పారిపోయారు. 1959లో మొసళ్ల చేతిలో తీవ్రంగా గాయపడి స్థానిక ఆటవిక తెగల ప్రజల కంటబడ్డారు. వారి చికిత్సతో కోలుకున్న మైఖేల్ ఆ తర్వాత కూడా అడవుల్లోనే ఉండిపోయాడు. అడవుల్లో ఒంటరిగా ఉండే మైఖేల్ అప్పుడప్పుడు జనసంచారం ఉండే దారుల్లోకి వచ్చి భయపెడుతున్నాడంటూ స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో, 1964లో అతనిని పట్టుకుని మానసిక చికిత్సాలయంలో చేర్చారు. చికిత్స జరుగుతుండగా ఆయన తిరిగి అడవిలోకి పారిపోయారు. 2012లో చివరిసారి అడవుల్లో స్థానికులకు కనిపించిన మైఖేల్ తరువాత ఎవరికీ కనిపించలేదు. దీంతో ఆయన మృతి చెంది ఉంటాడని అంతా భావించారు. అయితే ఆయన జింపీస్ కూయిండా వృద్ధాశ్రమంలో ఉన్నట్టు మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది. ఆయన స్ఫూర్తిగా 2007లో 'ఇన్ టు ది వైల్డ్' అనే సినిమా కూడా తీశారు. అది మంచి విజయం సాధించింది.