: ఆసుపత్రిలోకి చొరబడిన నాగుపాములు; పరుగులు పెట్టిన డాక్టర్లు, పేషెంట్లు


ఆసుపత్రిలోకి చొరబడిన నాగుపాములు అక్కడున్న వారందరినీ హడలెత్తించాయి. చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు, వైద్యం అందిస్తున్న డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. ఈ ఘటన చిత్తూరు పట్టణం, మిట్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ ఉదయం ఓపీ విభాగం ప్రారంభం కాగానే వైద్యులు తమ సేవలను ప్రారంభించారు. ఎంతో మంది వ్యాధిగ్రస్తులు, వారి వెంట వచ్చిన వారితో ఆ ప్రాంతం హడావుడిగా ఉంది. ఇంతలోనే రెండు నాగుపాములు లోపలికి ప్రవేశించాయి. వీటిని గమనించిన వెంటనే అక్కడ తీవ్ర భయాందోళనలు అలముకున్నాయి. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లు అందరూ పరుగందుకున్నారు. ఆ తర్వాత పాములు పట్టే వారికి సమాచారం అందజేశారు. వారు వచ్చి రెండు పాములను తీసుకెళ్లారు. అయినప్పటికీ రోగులు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. మరోవైపు, ఈ ఘటనతో ఇన్ పేషెంట్ విభాగంలో తలుపులు, కిటికీలు మూసివేశారు.

  • Loading...

More Telugu News