: గొడ్డు మాంసంతో విందు ఇస్తానని ప్రకటించిన బీజేపీ నేత... కలకలం
బీఫ్ (గొడ్డు మాంసం) అంటేనే బీజేపీ మండిపడుతుంది. గొడ్డు మాంసం విక్రయాలను కూడా ఆ పార్టీ సమర్థించదు. అలాంటిది, బీఫ్ తో విందు ఇస్తానంటూ ఓ బీజేపీ నేత ప్రకటించి, వివాదానికి తెర లేపారు. వివరాల్లోకి వెళ్తే, జమ్ము కాశ్మీర్ బీజేపీ నేత ఖుర్షీద్ అహ్మద్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు బీఫ్, హిందువులకు శాకాహారంతో విందు ఏర్పాటు చేస్తానని... తద్వారా మతసామరస్యానికి పాటుపడతానని ప్రకటించారు. ఈ విందును పార్టీ అనుమతితో కాకుండా, వ్యక్తిగతంగానే ఇస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జమ్ము కాశ్మీర్ లోని అధికార పీడీపీ, బీజేపీ నేతలు కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.