: పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటించబోతున్నారా?
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి ఈ పర్యటన మొదలువుతుందని అంటున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి పవన్ తన పర్యటన ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఈ పర్యటనలో జిల్లాల వారీగా అభివృద్ధి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సరిచేసే ప్రయత్నం చేయడం, కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న ప్రజలకు అండగా నిలవాలన్న అజెండాతో శ్రీకాకుళంకు పవన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీకి మద్దతిస్తున్న జనసేనాని రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై సమయానుకూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి భూముల విషయంలో తనదైన ప్రభావాన్ని చూపారు. ఈ నేపథ్యంలో ప్రజలు పవన్ పై ఓ నమ్మకానికి వచ్చారని చెప్పొచ్చు. మరోవైపు భవిష్యత్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ఇప్పటినుంచే ఓ కార్యాచరణ పాటించాలని, అందుకోసం ప్రజల్లో తమదైన ముద్ర వేయాలని భావించే పవన్ ఈ పర్యటన చేస్తున్నట్టు అనుకోవచ్చు. ఏదేమైనా రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేస్తూ, పార్టీ వక్రమార్గం పట్టకుండా చూసుకుంటున్న పవన్, కొన్నాళ్లకు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పొచ్చు.