: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వరల్డ్ బ్యాంకు చూపిన తేడాలివే!
వ్యాపారానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆసలు తెలుగు రాష్ట్రాల్లో ఈ తేడాకు కారణమేంటి? ర్యాంకులిచ్చే సమయంలో ప్రపంచబ్యాంకు ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివర్ణించింది? అన్న అంశాలను పరికిస్తే... ఆంధ్రప్రదేశ్: 2015 నుంచి 20 వరకూ అమలు చేస్తామంటూ, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకగవాక్ష (సింగిల్ విండో) విధానం ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపే కంపెనీలకు 21 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. సదరు పరిశ్రమకు సంబంధించిన దరఖాస్తుల నుంచి అనుమతి మంజూరు చేయాల్సిన విభాగాల వరకూ అదే సింగిల్ డెస్క్ నుంచి పనులు సాగిస్తుంది. ఈ మొత్తం విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తుంటారు. తెలంగాణ: టీఎస్-ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) చట్టం-2014 ఈ రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులను తేనుంది. వివిధ అనుమతులు, పరిశ్రమలకు ఆహ్వానం పలికేందుకు ఔత్సాహికులు అందించే సెల్ఫ్ సర్టిఫికేషన్ నే ప్రాతిపదికగా అనుమతులు మంజూరు చేయడం ఈ విధానంలో ప్రత్యేకత సింగిల్ విండో: * ఆంధ్రప్రదేశ్: ఆన్ లైన్లో అందుబాటులో ఉండే సింగిల్ విండో పోర్టల్ ద్వారా దరఖాస్తు నుంచి, అది ఎంతవరకూ వచ్చింది? అనుమతులు ఎప్పుడు రావచ్చు? వంటి విషయాలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. * తెలంగాణ: టీఎస్-ఐపాస్ విధానంలో వచ్చే కంపెనీలకు 17 విభాగాలకు సంబంధించి రావాల్సిన అనుమతులకు సమయ అవధులు ఉంటాయి. ఈ అవధి దాటేలోగా, అనుమతులు వస్తాయి. రిజిస్ట్రేషన్: * ఆంధ్రప్రదేశ్: ప్రాథమిక డాక్యుమెంట్ల పరిశీలనతోనే పలు విధాలైన రిజిస్ట్రేషన్లు, స్పాట్ అనుమతులు లభిస్తాయి. * తెలంగాణ: స్వీయ నిర్ధారణ పత్రాలు అందించిన వెంటనే వాటి రిజిస్ట్రేషన్లు పూర్తయిపోతాయి. పన్నులు: * ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్స్, రిటర్న్ ల దాఖలుకు ఆన్ లైన్ విధానం అమలు అవుతుంది. విలువ ఆధారిత పన్ను తదితర రాష్ట్రానికి రావాల్సిన పన్నులన్నీ పారదర్శకంగా ఆన్ లైన్ మాధ్యమంలో ఎప్పటికప్పుడు ఫాలో కావచ్చు. * తెలంగాణ: ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పాటిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలులో ఉంది. వీటితో పాటు ఏపీలో కార్మిక వ్యవస్థ పుష్కలంగా ఉందని, భూముల లభ్యత సంతృప్తికరమని వరల్డ్ బ్యాంకు ప్రకటించింది. ఇక తెలంగాణలో విద్యుత్ లేదా పొల్యూషన్ సర్టిఫికెట్ పొందడం అత్యంత సులువని వెల్లడించింది. ఇందుకోసం రెండు డాక్యుమెంట్లను అందిస్తే సరిపోతుందని వివరించింది.