: 'సూదిగాడు' అంటూ పరువు తీసేశారు, ఆనక 'సారీ' చెప్పారు!
చిన్న పాపకు ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న ఆలోచనతో మంచి చేద్దామని వెళ్లిన ఆ యువకుడి పరువు పోయింది. ఎంతమాత్రమూ సంబంధంలేని అతని స్నేహితుడు సైతం మీడియా అత్యుత్సాహానికి బలయ్యాడు. పేపర్లలో 'సూదిగాడు', 'సైకో' అన్న అభివర్ణనలతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారీ ఫ్రెండ్స్. మొన్న హైదరాబాద్ పరిధిలోని ఇందిరానగర్ లో ఓ పాపకు సూది గుచ్చుతున్నాడంటూ, కొందరు స్థానికులు సురేష్ అనే యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. సురేష్ ను కాపాడేందుకు వచ్చిన అతని రూమ్మేట్ ను సైతం పోలీసులు జీపెక్కించారు. ఆ వెంటనే మీడియా ఫోటోలు తీయడం, క్షణాల్లో వీడియో టీవీ చానళ్లలో ప్రసారం కావడం జరిగిపోయాయి. తీరా విచారిస్తే, వీరికి ఎటువంటి దురుద్దేశాలు లేవని పోలీసులు తేల్చి విడిచిపెట్టారు. వారి రూమును సోదా చేసినా ఏమీ అనుమానిత వస్తువులు లభించలేదని వెల్లడించారు. చావగొట్టిన స్థానికుల్లో కొందరు వచ్చి 'సారీ' చెప్పి పోయారు. కానీ, పోయిన పరువు ఎలా తిరిగొస్తుంది? బంధువులు, స్నేహితుల మధ్య తమ ప్రతిష్ఠ దెబ్బతిందని వీరిద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న పొరపాటున తాము కేసుకు సంబంధం లేని సురేష్ స్నేహితుడి చిత్రాన్ని పొరపాటున ప్రచురించామని, అందుకు చింతిస్తున్నామని సాక్షి దినపత్రిక తన అధికార వెబ్ సైట్ లో వెల్లడించింది.