: రూ. 2,500 కోట్లు కావాలంటూ వస్తున్న ఇండిగో... అంతకన్నా ఎక్కువే ఇస్తామంటున్న ఇన్వెస్టర్లు!


ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ భాగస్వామ్య సంస్థగా తక్కువ ధరలకు విమాన ప్రయాణాన్ని దగ్గర చేసి భారీ లాభాలతో దూసుకుపోతున్న భారత ప్రైవేటు రంగ విమానయాన సంస్థ 'ఇండిగో' ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించింది. మొత్తం రూ. 2,500 కోట్లను ఈ ఐపీఓ ద్వారా సమీకరించాలన్నది ఇండిగో అభిమతం. కాగా, ఇటీవలి ఆర్థిక ఫలితాలు, అభివృద్ధి దిశగా ఇండిగో తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఎయిర్ లైన్ బ్రాండ్ గా ఉన్న ఇండిగో ఈ సంవత్సరం జూన్ లో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ వాటాల విక్రయానికి సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్సీ, బార్ల్కేస్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, కోటక్ మహీంద్రా వంటి సంస్థలు మేనేజర్లుగా ఉన్నాయి. దేశవాళీ ఎయిర్ లైన్స్ సంస్థల్లో లాభాలను నమోదు చేస్తున్న రెండు విమానయాన సంస్థల్లో ఇండిగో ఒకటి. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా, ప్రైవేటు దిగ్గజం స్పైస్ జెట్ వంటి సంస్థలు విఫలమైన సమయంలో ఇండిగోతో పాటు 'గో ఎయిర్' మాత్రమే లాభాలను మూటగట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. గత ఏడేళ్లుగా లాభాల్లోనే కొనసాగుతున్న ఇండిగో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభాలను ఏకంగా నాలుగు రెట్లు పెంచుకుని రూ. 1,304 కోట్లను ఖజానాకు చేర్చుకుంది. దీంతో ఈ ఐపీఓ ద్వారా సంస్థ వాటాలను దక్కించుకునేందుకు ఇన్వెస్టర్లు క్యూ కడతారని అంచనా.

  • Loading...

More Telugu News