: ఇండియాకు మరింత టెన్షన్... పాక్, చైనాల మధ్య నిర్మాణం పూర్తయిన ఐదు సొరంగాలు
సరిహద్దుల్లో భారత్ కు మరింత ఆందోళన కలిగిస్తూ, చైనా, పాకిస్థాన్ ల మధ్య నిర్మాణం పూర్తిచేసుకున్న ఐదు సొరంగాలను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతికి అంకితం చేశారు. పాక్, చైనాల మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేస్తూ, దూరాన్ని తగ్గించేలా కోరాకోరమ్ హైవేపై నిర్మించిన వీటిని నవాజ్ ప్రారంభించారని రేడియో పాకిస్థాన్ ప్రకటించింది. టన్నెల్స్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా ప్రచురించింది. ఈ చిత్రాల్లో "లాంగ్ లివ్ పాక్-చైనా ఫ్రెండ్ షిప్" అని పెద్ద పెద్ద స్లోగన్స్ సొరంగం ముందు కనిపిస్తున్నాయి. పాక్, చైనాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఈ హైవే ఎంతో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. కాగా, బీబీసీ కథనం ప్రకారం, ఈ సొరంగాలను గిల్జిత్-బల్టిస్థాన్ పరిధిలోని హుంజా లోయల్లో 'పాకిస్థాన్-చైనా ఫ్రెండ్ షిప్ టన్నెల్స్' పేరిట చైనా స్వయంగా నిర్మించింది. మొత్తం మూడు సంవత్సరాల రెండు నెలల్లో ఇవి పూర్తయ్యాయి. ఈ ఐదు సొరంగాల పొడవు 7 కిలోమీటర్లు.