: ఆత్మహత్యా యత్నం చేసిన డాల్ఫిన్...ఆకట్టుకుంటున్న వీడియో
యుద్ధంలో పాల్గొంటున్నవారు ప్రత్యర్థికి చిక్కినప్పుడు ఆత్మత్యాగమే సరైన నిర్ణయంగా భావించి ఆత్మహత్యాయత్నం చేస్తారు. అయితే, ఇలాంటి ఆత్మహత్యాయత్నం కేవలం మనుషులేకాదు, జంతువులు కూడా చేస్తాయని ఓ డాల్ఫిన్ నిరూపించింది. డాల్ఫిన్ వేట కొనసాగే జపాన్ పసిఫిక్ తీరంలోని తాయ్ జి పట్టణంలో ప్రతి ఏటా డాల్ఫిన్ల వేట జాతరలా జరుగుతుంది. వందలాది డాల్ఫిన్లను వేటాడి ఎగుమతులు చేస్తూ సంప్రదాయాన్ని వ్యాపారం చేసేశారు తాయ్ జి పట్టణవాసులు. సెప్టెంబర్ లో ఈ రాక్షస క్రీడ మొదలవుతుంది. ఈ ఏడాది కూడా ఆలాగే వేట సాగుతోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ రిస్సోస్ జాతికి చెందిన ఓ యువ డాల్ఫిన్ వేటగాళ్లు కట్టిన వల లోపల చిక్కుకుపోయింది. ఆ చిక్కు ముడి నుంచి తప్పించుకుందామని ఎంతగానో ప్రయత్నించి ఓడిపోయింది. ఇక మరణం తప్పదని భావించిన ఆ డాల్ఫిన్ ఆత్మహత్యాయత్నం చేసింది. నేరుగా ఒడ్డుకి వచ్చేసింది. తలని అక్కడి రాళ్లకేసి బాదుకుంది. ఊపిరి పీల్చడం ఆపేసింది. చివరి క్షణాల్లో ఉన్న ఆ డాల్ఫిన్ ను అక్వేరియంకి అమ్మి సొమ్ము చేసుకుందామని భావించిన వేటగాళ్లు అది బతకదని తెలుసుకుని వేటాడేశారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. డాల్పిన్లు కూడా మనిషిలాగే సంఘజీవులు, క్షీరదాలైన డాల్పిన్లు పిల్లలను మనుషుల్లానే పెంచుతాయి. వీటి మెదడు కూడా పెద్ద సైజులో ఉంటుంది. మనిషితో ఇన్ని సారూప్యతలున్న డాల్ఫిన్లు ఆత్మహత్యల్లో కూడా మనుషులనే పోలడం విశేషమని నెటిజన్లు పేర్కొంటున్నారు.