: గోశాలను 'వార్ రూమ్'గా మార్చిన లాలూ తనయుడు!
బీహార్ రాజకీయాల్లో తలపండిన లాలూ ప్రసాద్ యాదవ్, తన బిజీ దైనందిన జీవితం నుంచి కాస్తంత సేదదీరాలని భావిస్తే, ఏం చేస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలుసు. తన ఆవులకు మేత వేస్తాడని, పాలు పితుకుతూ కూర్చుంటాడని ఎన్నోసార్లు వార్తల్లో చదివాం కూడా. పాట్నాలోని ధన్ పూర్ గోలా రోడ్డులోని ఓ పెద్ద ప్రాంగణంలో లాలూ గోశాల, గెస్ట్ హౌస్ తదితరాలున్నాయి. ఇప్పుడా గోశాలను లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజశ్వీ యాదవ్ 'వార్ రూమ్'గా మార్చివేశారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రచారం, కరపత్రాల డిజైన్, స్లోగన్స్ తదితర వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే సాగుతున్నాయి. ఈ వార్ రూములో కార్టూనిస్టులు, కంటెంట్ రైటర్లు, స్లోగన్లు రాసేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు... ఇలా 30 మందికి పైగానే పనిచేస్తున్నారు. వీరందరికీ దగ్గరుండి సూచనలు ఇస్తూ, తేజశ్వి బిజీగా ఉంటున్నారు. ఇక్కడ ఖరారైన స్లోగన్లను, పోస్టర్లను లాలూ ప్రసాద్ చూసిన తరువాతనే సామాజిక మాధ్యమాలకు, ప్రింటింగుకూ పంపుతారు. ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా, లాలూకు సరైన రాజకీయ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న తేజస్వి, ఈ ఎన్నికల్లో అధునాతన సాంకేతికతను ప్రచారం కోసం వాడుకుంటున్నారు. ఇందులో విజయం సాధిస్తే, ఆయన తిరుగులేని నేతగా మారతారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.