: కొంతకాలం బంగారాన్ని వదిలి వెండి సంగతి చూడండి!


కొద్ది వారాల క్రితం వరకూ తక్కువలో ఉన్నట్టు కనిపించిన బంగారం ధరలు తిరిగి పెరిగాయి. ఇదే సమయంలో మరో విలువైన లోహం వెండి ధర ఆల్ టైం రికార్డు స్థాయితో పోలిస్తే 40 శాతం తక్కువ ధరకు లభిస్తోంది. బంగారం విషయంలో ప్రపంచంలోనే రెండవ అత్యధిక దిగుమతిదారుగా ఉన్న ఇండియా, వెండి విషయంలో మాత్రం తొలి స్థానంలో ఉంది. ధరలు తక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో బంగారాన్ని కొద్దికాలం పక్కనబెట్టి, వెండి కొనుగోళ్లు, వెండిపై పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 2012, డిసెంబర్ 31 నాడు కిలో వెండి ధర రూ. 57,800ను దాటింది. కానీ, ఇప్పుడు రూ. 35,200 వద్ద ఉంది. అంతే కాదు, 2012తో పోలిస్తే 2013లో 24.25 శాతం తగ్గిన కిలో వెండి ధర, ఆపై 2014లో 15.07 శాతం, 2015లో 5.38 శాతం వరకూ (సెప్టెంబర్ 12వ తేదీ నాటికి) తగ్గింది. ఇదే సమయంలో 2012లో 1,921 టన్నుల వెండి ఇండియాలోకి దిగుమతి కాగా, 2014లో ఈ మొత్తం ఏకంగా 6,843 టన్నులకు చేరింది. ఈ సంవత్సరం ఇప్పటికే 5 వేల టన్నులకు పైగా వెండి దిగుమతి అయింది. డిసెంబర్ నాటికి 8 వేల టన్నుల వెండి ఇండియాకు వస్తుందని అంచనా. ఇన్వెస్టర్లు, సాధారణ ప్రజలు వెండిని బాగా కొనుగోలు చేస్తున్నారని ఆభరణాల తయారీదారులు అంటున్నారు. బంగారంతో పోలిస్తే, వెండి ధరలు వేగంగా పడిపోతున్నాయి. పది గ్రాముల బంగారం కొనుగోలు చేసే డబ్బుతో దాదాపు 750 గ్రాముల వెండిని కొనుగోలు చేయవచ్చు. అందువల్లే వెండి అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి. బులియన్ నిపుణులు సైతం ప్రస్తుత తరుణంలో వెండిపై పెట్టుబడి మంచిదని సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News