: చంద్రన్న ఏంటి? చంద్రబాబు తాత వయసులో ఉన్నారు!: వైసీపి నేత గుడివాడ అమర్నాథ్
ఏపీలో చంద్రన్న రైతు యాత్రపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ తాత వయసులో ఉన్న సీఎం చంద్రబాబు... రైతన్న కోసం చంద్రన్నగా అవతారం ఎత్తారన్నారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయం భూసేకరణపై ఆయన విశాఖలో మండిపడ్డారు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అని చెప్పి ఉత్తరాంధ్రలో గ్రీన్ ఫీల్డ్ లేకుండా చేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. అన్ని మండలాల్లో భూముల విలువలను పెంచిన ప్రభుత్వం భోగాపురం వచ్చేసరికి ఎందుకు సవరించలేదని అడిగారు. రైతుల పొలాలు తీసుకుని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి మద్దతిచ్చిన గ్రామాలను వదిలి మిగతా గ్రామాల్లో భూమి సేకరించడం సమంజసం కాదన్నారు.