: నేరాన్ని అంగీకరించిన ఐఎస్ఐఎస్ ప్రచారకర్త నిక్కీ జోసెఫ్
నాలుగు రోజుల కిందట హైదరాబాదు, శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టైన ఐఎస్ఐఎస్ ప్రచారకర్త అఫ్సా జబీన్ (37) అలియాస్ నిక్కీ జోసెఫ్ నేరాన్ని అంగీకరించింది. పోలీసులు, ఎన్ఐఏ నిఘా వర్గాల అధికారులు విచారించిన సమయంలో పలు అంశాలు వెల్లడించింది. ఐఎస్ఐఎస్ కార్యకలాపాల పట్ల తీవ్రంగా ప్రభావితమయ్యానని, సున్నీలు, షరియత్ చట్టం కోసం పోరాడుతున్న ఐఎస్ఐఎస్ సంస్థకు తాను మద్దతురాలినని తెలిపినట్టు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. మొహనుద్దీన్ తో కలసి 2010లో ఫేస్ బుక్ గ్రూప్ ఏర్పాటు చేశామని, తమ ఫేస్ బుక్ గ్రూప్ ను 50 వేల మంది అనుసరించేవారని వివరించినట్టు తెలిపారు. ఐఎస్ఐఎస్ కార్యకలాపాలను వీడియోలుగా రూపొందించి భారతీయ యువతను రెచ్చగొట్టామని చెప్పినట్టు చెప్పారు. తమ ఐఎస్ఐఎస్ వీడియోలు పోస్టు చేయడంతో తమ అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగించిందని, మొహనుద్దీన్ అరెస్టు కావడంతో ఫేస్ బుక్ అకౌంట్, ఐడీని తొలగించామని నిక్కీ చెప్పినట్టు నేరాంగీకార పత్రంలో పొందుపరిచారు.