: మహిళలు తిరగబడతారనే ఆయన వెనకడుగు వేశారు: టీటీడీపీ నేత శోభారాణి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు శోభారాణి విరుచుకుపడ్డారు. చీప్ లిక్కర్ తీసుకురావాలని కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేశారని... అయితే, చీప్ లిక్కర్ తీసుకొస్తే చీత్కారాలు తప్పవని మహిళలు హెచ్చరించడంతో, మహిళలు తిరగబడతారనే ఆయన వెనకడుగు వేశారని ఎద్దేవా చేశారు. మాయమాటలతో ప్రజలను వంచించి, అధికారాన్ని చేజిక్కించుకున్న ఓ గుంటనక్క కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని... దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్... అధికారం రాగానే, పదవీ వ్యామోహంతో తానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని విమర్శించారు. సైకిల్ గుర్తుపై గెలిచిన చల్లా ధర్మారెడ్డి కేవలం కాంట్రాక్టుల కోసమే టీఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, సీసాలు ఖాళీ చేయడం తప్ప నాయకులను తయారు చేసుకోవడం కేసీఆర్ కు రాదని ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వీరు పైవిధంగా వ్యాఖ్యానించారు.