: జైలుపై దాడి...తప్పించుకున్న 150 మంది ఉగ్రవాదులు, భీకర కాల్పుల్లో నలుగురి మృతి
ఆప్ఘనిస్తాన్ తాలిబాన్లు జైలుపై దాడి చేసి వందలాది ఖైదీలను విడిపించుకుపోయిన సంఘటన ఘాజిని సిటీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాజినీలో జరిగిన ఈ సంఘటనలో పోలీసులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టర్ కథనం ప్రకారం..ఇద్దరు సూసైడ్ బాంబర్లు, బాంబుతో ఉన్న ఒక కారుతో జైలు ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశారు. వారి మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. ఈ సంఘటనపై ఘాజిని డిప్యూటీ గవర్నర్ మహ్మద్ అలీ అహ్మదీ మాట్లాడుతూ 352 మంది ఖైదీలు తప్పించుకుపోయారని, ఇందులో 150 మంది తాలిబన్లు ఉన్నారన్నారు. భద్రతా దళాలకు చెందిన నలుగురు మృతి చెందారన్నారు. కాగా, తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, ఒక గన్ మెన్, ముగ్గురు సూసైడ్ బాంబర్లు ఈ దాడిలో పాల్గొన్నారన్నారు. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జైలుపై దాడి చేసి 400 మంది ఖైదీలను తప్పించామన్నారు. ఆఫ్ఘాన్ భద్రతాదళాలకు చెందిన 40 మందితో పాటు జైలు గార్డులను హతమార్చామని ఆయన చెప్పారు.