: ఆ యువకుని సాహసం గొలుసు దొంగలను ఇలా పట్టించింది!
ఓ యువకుడు చేసిన సాహసం ఇద్దరు గొలుసు దొంగలను పోలీసులకు పట్టించింది. ఈ ఘటన నేటి ఉదయం అనంతపురం పరిధిలోని మారుతీనగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డుపై వెళుతున్న ఓ మహిళ మెడ నుంచి, బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు బంగారం గొలుసు లాక్కొని పారిపోతుండగా, అదే దారిలో వెళుతున్న ఓ యువకుడు చూశాడు. వెంటనే స్పందించి, కేకలు పెడుతూ, తన బైకుతో వారిని వెంబడించాడు. వారి బైకును తన బైకుతో ఢీకొట్టించాడు. వారిని కిందపడేశాడు. ఇంతలో స్థానికులు వచ్చి దుండగులను బంధించారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువకుడు చేసిన సాహసానికి ప్రశంసల వర్షం కురుస్తోంది.