: 20 ఎకరాల్లో అమరావతి టౌన్ షిప్... తక్షణ నిర్మాణానికి శరవేగంగా అడుగులు!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తక్షణ అవసరాల నిమిత్తం 20 ఎకరాల్లో టౌన్ షిప్ నిర్మించాలని, ఇక్కడి భవనాల్లో 10 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేలా సదుపాయాలు కల్పించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. వీలైనంత త్వరగా అమరావతి నుంచి పరిపాలన సాగాలని చంద్రబాబు సర్కారు భావిస్తుండగా, కనీసం 5 లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, నివాస గృహాలు నిర్మించాల్సివుందని సీఆర్డీయే ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. సంయుక్త డెవలపర్ విధానంలో 20 ఎకరాలను ప్రైవేటు సంస్థకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చి నిర్మాణాలను చేపట్టాలన్నది సర్కారు యోచన. కాంట్రాక్టును పొందే ప్రైవేటు సంస్థకు ఈ 20 ఎకరాల్లో సగాన్ని విక్రయించుకునే హక్కును ఇస్తారు. అది కూడా 99 సంవత్సరాల కాంట్రాక్టు విధానంలో అమ్ముకోవాల్సి వుంటుంది. ఈ ప్రతిపాదనలపై సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వాధికారులు వెల్లడించారు.