: మరో వివాదంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి
భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, డైరెక్టర్ రవిశాస్త్రిలు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రికెట్ టీం, మేనేజ్ మెంట్, ఇతర సభ్యుల్లో ఎవరైనా విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్టు తెలిస్తే చూస్తూ ఊరుకోబోమని ఒకవైపు బీసీసీఐ స్పష్టం చేస్తుంటే, వీరిద్దరూ ఐటీపీఎల్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్)లో భాగస్వాములు అయ్యారు. ఐటీపీఎల్ జట్టు యూఏఈ రాయల్స్ లో కోహ్లీ కొంత వాటాను కొనుగోలు చేసి, రవిశాస్త్రిని సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కాస్తంత కోపంగానే ఉన్నారు. కోహ్లీ, రవిలు క్రికెట్ జట్టుకు సేవలందిస్తూ, మరో ఆటతో ప్రయోజనాలు పొందడం నిబంధనలకు విరుద్ధమన్నది ఆయన భావన. ఐటీపీఎల్ తో బంధం తరువాత, క్రికెట్ కు సంబంధించి పూర్తి న్యాయం చేయలేకపోవచ్చని, నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉండదని బీసీసీఐ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి వారిద్దరితో చర్చిస్తానని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రవిశాస్త్రి మాత్రం, టెన్నిస్ కు క్రికెట్ కు లింకేంటని ప్రశ్నిస్తుండటం గమనార్హం.