: బిర్లా రికార్డు వారంలో కొట్టుకుపోయింది...‘లింకన్ హౌస్’ను రూ.750 కోట్లకు కొన్న పూనావాలా
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వారం క్రితం ఆదిత్యా బిర్లా గ్రూపు సంస్థల అధినేత కుమార మంగళం బిర్లా రూ.425 కోట్లు పెట్టి ‘జతియా హౌస్’ను కొనుగోలు చేశారు. అప్పటిదాకా ముంబై రియల్టీనే కాక భారత రియల్టీ మార్కెట్ లోనూ ఇదే అత్యంత ఖరీదైన డీల్. ఈ రికార్డు బద్దలు కావడం దాదాపు అసాధ్యమే అనుకున్నారంతా. అయితే, వారం తిరక్క ముందే బిర్లా రికార్డు బద్దలైపోయింది. ఔషధ ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇన్ స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా, బిర్లా రికార్డును బద్దలు కొట్టారు. ముంబైలోని సంపన్నుల ప్రాంతం బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి సమీపంలోని ‘లింకన్ హౌస్’ను ఆయన ఏకంగా రూ.750 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేశారు. ఇప్పటిదాకా భారత రియాల్టీ చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్ గా రికార్డులకెక్కింది. రాజప్రసాదం లాంటి లింకన్ హౌస్ లో 2011దాకా అమెరికా రాయబార కార్యాలయం ఉండేది. ఆ తర్వాత ముంబైలోని బీకేసీ ప్రాంతంలో మరింత విశాలమైన భవంతిలోకి అమెరికా కాన్సులేట్ మారింది. ఖాళీ అయిన లింకన్ హౌస్ ను అప్పటి నుంచీ అమెరికా విక్రయించాలని చూసినా, ఆఫర్ ధర మరీ ఎక్కువగా ఉండటంతో ఈ భవనం ఇప్పటిదాకా అమ్ముడుపోలేదు. ఈ భవనంపై కనీసం రూ.850 కోట్లయినా రాబట్టాలని అమెరికా భావించినా, మార్కెట్ ఆశాజనకంగా లేని నేపథ్యంలో పూనావాలా ఆఫర్ చేసిన రూ.750 కోట్లకు అమ్మేసింది. ఇక బిర్లా తరహాలోనే పూనావాలా కూడా ఈ భవంతిని తన నివాసంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.