: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం... తిరగబడ్డ లారీ, 18 మంది మృతి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి సిమెంట్ బూడిద లోడుతో విశాఖ వెళుతున్న ఓ లారీ తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది దాకా మృత్యువాత పడగా, మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పనుల కోసం వెళ్లి స్వస్థలాలకు తిరిగివస్తున్న కూలీలు ఏలూరు బైపాస్ వద్ద ఈ లారీ ఎక్కారు. దాదాపు 35 మందికి పైగా కూలీలను లారీ డ్రైవర్ ఎక్కించుకున్నట్టు సమాచారం. అతి వేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా పరారయ్యాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, 108 సిబ్బంది క్షతగాత్రులను రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించారు.