: దిగ్విజయ్ సింగ్ పదవులకు ఎసరు?
ఏడుపదుల వయసుకు దగ్గరలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, మహిళా జర్నలిస్టును ఇటీవల వివాహమాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నారో తెలియదు కానీ, ఆయన పదవికి మాత్రం ఎసరు పెట్టడానికి ఒక మంచి ముహూర్తం కోసం రాహుల్ గాంధీ క్యాంప్ వారు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడే ఆయనపై వేటు పడాల్సి ఉందని రాహుల్ వర్గీయులు అంటున్నారు. కానీ, కారణాంతరాల వల్ల అది ఆగిపోయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, డిగ్గీ రాజా ప్రేమపెళ్లి ఉండనే ఉంది. కానీ, అది ఆయన వ్యక్తిగత వ్యవహారంగా పరిగణించి వదిలివేయవచ్చు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా డిగ్గీ విఫలమయ్యారని రాహుల్ అభిప్రాయమట. అంతేకాకుండా, అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారిని సలహా మండలికి, సీడబ్ల్యుసీకి పరిమితం చేయాలని ఉన్న నిబంధనను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి వృద్ధ నేతలను పక్కనపెట్టే పనిలో ఉన్నట్లు రాహుల్ క్యాంపు చెబుతోంది.