: నవ్యాంధ్రలో పెట్టుబడులకు బ్రిటన్ ఆసక్తి... స్పీకర్ కోడెల ప్రకటన
నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే చైనా, జపాన్, సింగపూర్, జర్మనీ తదితర దేశాల పారిశ్రామికవేత్తలు నవ్యాంధ్రలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా బ్రిటన్ పారిశ్రామికవేత్తలు కూడా నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు అక్కడ పర్యటించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న ప్రకటించారు. ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి బ్రిటన్ వెళ్లిన కోడెల అక్కడి ప్రవాసాంధ్రులతో పాటు ఆ దేశ పారిశ్రామికవేత్తలతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి వివరించారు. అంతేకాక నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు కూడా రావాలని కోడెల వారిని ఆహ్వానించారు. కోడెల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన అక్కడి పారిశ్రామికవేత్తలు తప్పనిసరిగా అమరావతి శంకుస్థాపనకు వస్తామని తెలిపారు.