: నేనేమీ వీఐపీని కాదు..ఆ జాబితా నుంచి నా పేరు తొలగించండి: రాబర్ట్ వాద్రా
తానేమీ వీఐపీనీ కాదని, ఎయిర్ పోర్టులో వీఐపీ జాబితా నుంచి తన పేరును తక్షణం తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ జాబితా నుంచి తన పేరును ఇంకా తొలగించకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తానెప్పుడూ ఆ హోదాను ఉపయోగించుకోలేదని, దాని అవసరం కూడా తనకు లేదని చెప్పారు. సాధారణ పౌరుడిని చూసినట్లే తనను చూస్తే చాలని వాద్రా అన్నారు. తాను వీఐపీ, వీవీఐపీ కాదన్న విషయాన్ని సంబంధిత శాఖాధికారులు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాబర్ట్ వాద్రా పేరును వీఐపీ జాబితా నుంచి తొలగించే ఉద్దేశ్యం లేదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.