: ఆంధ్రాలో రైతుల మృతదేహాలను బాబు ఇంటి ముందు ఉంచండి: టీఆర్ఎస్
రాయలసీమలోని కర్నూల్, అనంతపురం జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు కానీ, లేకపోతే విజయవాడలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కానీ ఉంచాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతదేహాలను సీఎం కార్యాలయం ముందు వేస్తామన్న టీటీడీపీ నాయకుల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. వారివారి పరిపాలనా కాలంలో రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు వేల సార్లు ఆత్మహత్యలు చేసుకోవాలని అన్నారు. కేవలం టీడీపీ హయాంలోనే 12 వేల మంది రైతులు తమ ప్రాణాలు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీల 19 ఏళ్ల పరిపాలనా కాలంలో 26 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. రైతులకు వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదే విధానాన్ని అక్కడ అవలంబిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఉన్మాదంతో ఉన్నాయంటూ ఆయన నిప్పులు చెరిగారు.