: భారత బాలిక ప్రతిభకు ఒబామా శభాష్
తన సైన్స్ ప్రాజెక్టుతో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల మేఘనారావు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో శభాష్ అనిపించుకుంది. వాషింగ్టన్ లోని అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో వార్షిక సైన్స్ ఫేర్ జరుగుతోంది. ఇందులో అమెరికా వ్యాప్తంగా పలు పాఠశాలలకు చెందిన 30 మంది విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనగా ఉంచారు. వీరిలో మేఘన కూడా ఒకటి. సహజ బొగ్గుకు సంబంధించిన ప్రాజెక్టు గురించి మేఘన వివరించిన తీరు ఒబామా మనసు గెలుచుకుంది. "నువ్వు మాకెంతో గర్వకారణం. ఇలానే మంచి ప్రగతిని సాధించాలి" అని ఒబామా మేఘనను మెచ్చుకున్నారు.
మేఘన ప్రతిభ చెప్పుకోవాలంటే మరెంతో ఉంది. 17 ఏళ్లకే ఈ అమ్మడు పోర్ట్ లాండ్ జూనియర్ సైంటిస్ట్స్(పిజెఎస్) అనే స్వచ్ఛంద సంస్థను 2011లో స్థాపించి నడుపుతోంది. ఇది హైస్కూల్ విద్యార్థులకు సైన్స్ ప్రయోగాల విషయంలో సహకారం అందించడంతోపాటు ఉన్నత విద్యలోనూ ప్రోత్సాహం అందిస్తుంది. చిన్న వయసులోనే అంతగా సేవలందిస్తున్న మేఘనను 2013 సంవత్సరానికి యంగ్ నాచురలిస్ట్ అవార్డుతో అమెరికన్ నాచురల్ హిస్టరీ మ్యూజియం సత్కరించింది.