: నేనే 'సైకో'నట... ఒప్పుకోమంటూ పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు: 'హెచ్చార్సీ'కి ఫిర్యాదు చేస్తున్న నరసాపురం యువకుడు
నేను సైకోనని.. ఒప్పుకోమంటూ తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని గత రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న గాలి లాజర్ అనే వ్యక్తి ఆరోపించాడు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం డీఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో పోలీసులు లాజర్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం శనివారం తెల్లవారుజామున అతన్ని విడిచిపెట్టారు. అనంతరం అతను విలేకరులతో మాట్లాడుతూ తనను సైకో అని ఒప్పుకోమంటూ పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పాడు. తనను వేధింపులపాలు చేసిన పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మానవ హక్కుల సంఘానికి (హెచ్చార్సీ) ఫిర్యాదు చేస్తానని లాజర్ పేర్కొన్నాడు. కాగా, డీఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ, సైకో కోసం గాలిస్తున్న క్రమంలో లాజర్ ను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పోడూరు నుంచి ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే లాజర్ ను అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. సైకో దాడుల సంఘటనలతో లాజర్ కు ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించుకున్న తాము అతన్ని విడిచిపెట్టామని డీఎస్పీ చెప్పారు. అతన్ని ఎటువంటి వేధింపులకు గురి చేయలేదని అన్నారు.