: తస్మాత్ జాగ్రత్త, కుంభవృష్టి కురుస్తుంది!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం ఈ మధ్యాహ్నం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని, ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. కాగా, ఈ ఉదయం సైతం అనంతపురం, కడప, ప్రకాశం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసినట్టు తెలుస్తోంది.