: లీటరు పెట్రోలు రూ. 25కు... క్రూడాయిల్ ధర బ్యారల్ కు 20 డాలర్లకు పడిపోతుందట!


అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పాతాళానికి దిగజారనుందని, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. లండన్ కమోడిటీ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఆరేళ్ళ కనిష్ఠ స్థాయిలో 48 డాలర్ల వద్ద ఉండగా, ఈ ధరలు మరింత దిగజారి 20 డాలర్ల స్థాయిని తాకవచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. మార్కెట్లోకి వస్తున్న సరఫరా అధికంగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. చైనా ఆర్థిక వ్యవస్థలోని ఆందోళన సైతం ప్రభావం చూపనుందని గోల్డ్ మన్ శాక్స్ అనలిస్ట్ డమియన్ కోర్వాలిన్ వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి రోజుకు 5.85 లక్షల బ్యారళ్ల ముడి చమురు మార్కెట్లోకి వస్తోందని ఆయన వివరించారు. కాగా, మార్చి 2009 తరువాత ముడిచమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. గత సంవత్సరం జూన్ లో 115 డాలర్ల వద్ద ఉన్న క్రూడాయిల్ ధర 60 శాతానికి పైగా తగ్గింది. గోల్డ్ మన్ అంచనాల ప్రకారం క్రూడాయిల్ ధర 20 డాలర్లకు చేరిన పక్షంలో ఇండియాలో లీటరు పెట్రోలు ధర రూ. 25 వరకూ తగ్గుతుంది. అయితే, ఈ ధర రావాలంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 'పెట్రో' ఉత్పత్తులపై అమ్మకపు, ఎక్సైజ్ పన్నులను పెంచకుండా ఉండాలి.

  • Loading...

More Telugu News