: ఇకపై న్యాయవాదులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి
క్రిమినల్ కేసులు వాదించే న్యాయవాదులకు ఇకపై మానసిక, శారీరక పరీక్షలు తప్పనిసరి కానున్నాయి. దృఢంగా ఉన్నారని తేలితేనే క్రిమినల్ కేసులు వాదించేందుకు వారికి అర్హత లభిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మానసికంగా, శారీరకంగా న్యాయవాదులు సంసిద్ధంగా లేకపోతే కక్షిదారుడు బాధపడే పరిస్థితులు తలెత్తవచ్చనే కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టులో క్రిమినల్ కేసులు వాదించే లాయర్లకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు, అడ్వకేట్ల యాక్టు, అందుకు సంబంధించిన నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని జెఎస్ ఖేహర్, ఆదర్శ్ కె గోయల్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. అసలు క్రిమినల్ కేసులు వాదించే లాయర్లకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉండాలనే అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. సాక్షులను మళ్లీ ప్రవేశపెట్టాలన్న ఉబర్ రేప్ కేసులో నిందితుడి విజ్ఞప్తి తిరస్కారానికి గురైంది. ఆ కేసుకు సంబంధించిన లాయర్ అసమర్థత వల్లే ఇది జరిగిందని అభిప్రాయపడింది. క్రిమినల్ లాయర్లకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి లా కమిషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలతో పాటు సంబంధిత అధికారులు దృష్టిపెట్టాల్సిన అవశ్యకత ఉందని ధర్మాసనం తెలిపింది.