: ఇలాగే వర్షాలు పడితే శ్రీశైలం, సాగర్ ఎప్పటికి నిండుతాయో తెలుసా?


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరప్రదాయిని కృష్ణా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజనులో కృష్ణమ్మకు జలకళ కనిపించడం ఇదే తొలిసారి. కర్ణాటకలో వర్షాలు కురవకపోయినా, ఆల్మట్టి డ్యాం నుంచి నీటిని విడుదల చేయక పోయినా, కర్నూలు, ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో పడ్డ వర్షాలకు తుంగభద్రకు వచ్చి చేరిన నీరు జూరాల ప్రాజెక్టును నింపి, శ్రీశైలం వైపు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కులపైగా వరద నీరు వస్తోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 818.3 అడుగుల వరకూ నీరు చేరింది. 50 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుంటే, డ్యామ్ నిండేందుకు 2 వారాల వరకూ సమయం పడుతుంది. కనీసం 10 రోజుల వరద కొనసాగిన తరువాత మాత్రమే, నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. గత ఐదారు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిత్యమూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవే వర్షాలు కృష్ణా, గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసివుంటే, ఈ పాటికి ఏపీ, టీఎస్ ల్లోని ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయి వుండేవి. కాగా, గత రెండు రోజులుగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు కుందూ, పెన్నా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదనీటి కారణంగా పెన్నా నదిపై ఉన్న చిన్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాలంటే, కన్నడ నాట భారీ వర్షాలు కురవాల్సి వుంది.

  • Loading...

More Telugu News