: సచిన్, కోహ్లీల మధ్య ‘ట్వీట్’ వార్!
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. అయితే ఇదేమీ సీరియస్ పోరు కాదని, ఫన్ వార్ లో భాగంగానే వారిద్దరూ ట్వీట్లు సంధించుకున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకెళితే... నిన్న సచిన్, కోహ్లీకి ఓ ట్వీట్ పంపాడు. ‘నేను ఆడాలనుకుంటున్నాను’ అన్న సచిన్ ట్వీట్ కు కోహ్లీ కూడా వేగంగానే స్పందించాడు. ‘‘కచ్చితంగా చెప్పలేను కానీ, మీకు కావాల్సిన అర్హతలు లేవు’’ అని కోహ్లీ, సచిన్ కు రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లను చూసిన క్రీడాభిమానులు మాత్రం తొలుత వీరి మధ్య నిజమైన యుద్ధానికే తెరలేచిందని భావించారు. అయితే ఆ తర్వాత ఐటీపీఎల్ లో యూఏఈ రాయల్స్ లో కోహ్లీ వాటా దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్న కొందరు నెటిజన్లు, ఈ యుద్ధం పరిహాసంలో భాగంగానే జరిగిందని చెబుతున్నారు. రాయల్స్ టీమ్ కు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ నేతృత్వం వహిస్తున్నాడు. రోజర్ ఫెదరర్ కు సచిన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన ఫేవరేట్ టెన్నిస్ క్రీడాకారుడితో కలసి ఆడాలన్న తన కోరికను సచిన్, ఫెదరర్ జట్టు భాగస్వామిగా ఉన్న కోహ్లీ ముందు ఉంచాడని వారు వాదిస్తున్నారు.