: చేపల్ని తినడంలో జీవ హింస లేదట ...హైకోర్టుకు విన్నవించిన 'మహా' లాయర్లు
మహారాష్ట్రలో జైనుల పవిత్రమైన 'పరుష్యాన్'ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మాంసం విక్రయాలను నిషేధించింది. దీనిపై మాంసం ట్రేడర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన బాంబే హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులకు పలు ప్రశ్నలు సంధించింది. మాంసం సంగతి సరే, మరి చేపలు, గుడ్లను ఎందుకు నిషేధించలేదని నిలదీసింది. దానికి సమాధానమిస్తూ, మత విశ్వాసాలను గుర్తించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పిన సంగతి న్యాయస్థానం ముందుంచారు. మాంసం జీవ హింస కిందికి వస్తుందని, చేపలు నీటిలోంచి ఒడ్డుకు రాగానే చచ్చిపోతాయని, వాటిని చంపి తినడం లేదని, కాబట్టి అందులో హింస లేదని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకు చెప్పారు. దీంతో న్యాయమూర్తులు నివ్వెరపోయారు. మత విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని ఒక రోజు నిషేధంతో సరిపెట్టారు.