: ఇంకో 20 ఏళ్లలో మానవ జాతి అంతరించిపోతుందా?
ఇంకో 20 ఏళ్లలో భూమి అంతరించిపోతుందా? అంటే బ్రిటన్ కు చెందిన రచయిత, ప్రముఖ పాత్రికేయుడు గ్రాహం హాంకాక్ అవుననే అంటున్నారు. మానవ మనుగడ అంతానికి సంబంధించి సుమారు 200 ప్రాచీన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో వాస్తవం ఉందని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 12,800 ఏళ్ల క్రితం ఎలా అయితే భూమిపైనున్న జీవరాశి అంతమైందో అదే రీతిన మానవ జాతి అంతరిస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అప్పట్లో 'యంగర్ డ్రయాస్' అనే కోటి మెగాటన్నుల బరువున్న భారీ ఉల్క లక్షల కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీ కొట్టడంతో ధృవాలలో ఉన్న మంచు కరిగిపోయింది. అకస్మాత్తుగా ప్రళయం సంభవించింది. ఆ వేగానికి ఏర్పడిన మంటలు దావానలంలా వ్యాపించి సమస్తాన్ని దహించివేశాయి. దీంతో జడల ఏనుగులు, డైనోసార్లు వంటి జీవులతో పాటు సమస్త జీవరాశి అంతమైంది. ఇప్పుడు కూడా అలాంటి తోకచుక్కే ఒకటి భూమివైపు దూసుకువస్తోందని, అది మరో 20 ఏళ్లలో భూమిని ఢీ కొంటుందని ఖగోళ శాస్త్రవేత్త విక్టర్ క్లూబ్, బిల్ నాపియర్ చెబుతున్నారు. అయితే సమయం ఎప్పుడనేది చెప్పలేమని అంటున్నారు. కానీ రచయిత హాంకాక్ మాత్రం 20 ఏళ్లలోనే అది జరుగుతుందని కొందరు శాస్త్రవేత్తల అధ్యయనాలను ఉటంకిస్తూ ఘంటాపథంగా చెబుతున్నారు. 'మెజీషియన్స్ ఆఫ్ ది గాడ్స్' అనే పుస్తకంలో ఆయన ఈ విషయాలను పేర్కొన్నారు. ఈసారి మానవాళి మొత్తం అంతమవదని, కొంత మంది బతికి బట్టకట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. కాగా, 2012లోనే మానవాళి అంతమైపోతుందని, 'డూమ్స్ డే' వస్తుందని పలు పుకార్లు రేగిన సంగతి తెలిసిందే!