: సాటి ముస్లింలపై సౌదీ అరేబియాకి ఎంత ప్రేమో...!
సిరియా, ఇరాక్ దేశాలు అంతర్యుద్ధంతో నలిగిపోతున్నాయి. సున్నీ, షియాల మధ్య ఉన్న వైరం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. లక్షలాది మంది శరణార్థులు సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ ఇతర దేశాలకు తరలుతున్నారు. ఇందులో మెజార్టీ ప్రజలు మతం మారేందుకు కూడా వెనుకాడడం లేదు. వీరిని ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ నడుంబిగించింది. ఇంత వరకు కథ బాగానే ఉంది. క్రైస్తవం ఆచరించే యూరోపియన్ దేశాలు ముస్లింలను ఆదరిస్తున్నప్పుడు ధనిక దేశాలైన ముస్లిం దేశాలు ఏం చేస్తున్నాయి? అనే ఆలోచన అందర్నీ పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా పాత్రపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, సౌదీ అరేబియాలో పది లక్షల ఏసీ టెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ టెంట్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేదు. హజ్ యాత్ర ఉన్న ఐదురోజులు మాత్రమే ఆ టెంట్లు ఉపయోగపడతాయి. ఆ తరువాత ఏడాది పొడుగునా అవి ఖాళీగా ఉంటాయి. ఎనిమిది అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగిన ఆ టెంట్లలో 40 లక్షల మందికి ఆశ్రయం కల్పించవచ్చు. సిరియా అంతర్యుద్ధం కారణంగా 40 లక్షల మంది ప్రజలు వివిధ దేశాలకు వలస వెళ్లినట్టు ఒక అంచనా. ఏటా 5 లక్షల మంది ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తే, ఏటా అక్కడ 200 మసీదులు నిర్మిస్తామని జర్మనీకి సౌదీ అరేబియా బంపర్ ఆఫర్ ఇస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. సాటి ముస్లింలకు సాయం చేయడం మానేసి, ఇలాంటి ఆఫర్లేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి సౌదీ అరేబియా ఏమంటుందో... చూడాలి!