: యూఎస్ లో విడుదలైన రెండు రోజుల్లో ఇండియాలోకి యాపిల్ 6ఎస్ ప్లస్, మరి ధర ఎంతో తెలుసా?


మీరు యాపిల్ ఐఫోన్ ప్రియులా? రెండు రోజుల క్రితం అమెరికాలో విడుదలైన కొత్త రకం ఐఫోన్ 6ఎస్ ప్లస్ ను వెంటనే చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? నో ప్రాబ్లం... ఈ అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ఇండియాలోకి రానుంది. ఈ నెల 25న యూఎస్ మార్కెట్లోకి ఫోన్ విడుదలైతే, ఆపై రెండు రోజుల వ్యవధిలోనే ముంబైలోని హీరా పన్నా మార్కెట్లో ఇది దొరుకుతుంది. అయితే, అధికారికంగా కాదులెండి, గ్రే మార్కెట్ రూట్ లో! ఇండియాలో ఐఫోన్ ప్రియుల ఆతృతను సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న స్మగ్లర్లు రంగంలోకి దిగిపోయి ఈ కొత్త ఫోన్లను దేశానికి చేర్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు వేసేసుకున్నారు. దీని వాస్తవ ధర రూ. 65 వేలు కాగా, గ్రే మార్కెట్లో రూ. 1 లక్ష వరకూ పలకవచ్చని అంచనా. బంగారం రంగులో ఉండే ఐఫోన్ కు మంచి డిమాండ్ ఉంటుందని, హీరా పన్నా మార్కెట్లో మొబైల్ స్టోర్ ను నిర్వహిస్తున్న ఓ వ్యాపారి వెల్లడించాడు. తమకు ఫోన్ కావాలని అడుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపాడు. యూఎస్ లోని తమ ఏజంట్లు ఇప్పటికే యాపిల్ స్టోర్లలో ముందస్తు ఆర్డర్లు పెట్టేశారని వివరించాడు. కాగా, గ్రే మార్కెట్ ఏజంట్లు అతికొద్ది కాలం మాత్రమే ధరలను శాసించగలుగుతారు. భారత మార్కెట్ తమకు అత్యంత ముఖ్యమని భావించే యాపిల్ సంస్థ వచ్చే నెల 11 నుంచి 15 మధ్య దసరా సీజన్ సందర్భంగా ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News