: హృదయం లేని దాన్ని కాదు... తప్పు జరిగిపోయింది: క్షమాపణ చెప్పిన కెమెరా ఉమెన్


ఆశ్రయం కోసం చిన్న బాబును ఎత్తుకుని పరుగులు పెడుతూ వస్తున్న శరణార్థికి కాలు అడ్డుపెట్టి ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చుకున్న హంగేరీ కెమెరా పర్సన్ పెట్రా లాస్ జ్లో పోలీసుల విచారణలో నోరు విప్పింది. ఆ సమయంలో తనపై దాడి చేసేందుకు వస్తున్నారన్న ఆందోళనతో మాత్రమే ఆ పని చేశానని తెలిపింది. "నా వీడియో ఫుటేజ్ నేను చూశాను. జరిగిన దానికి నిజాయతీగా క్షమాపణ కోరుతున్నాను. దీనికి పూర్తి బాధ్యత నాదే. నేనేమీ హృదయం లేని అమ్మాయిని కాను. చిన్నారిని కిందపడేసేంత దుర్మార్గురాలిని అంతకన్నా కాదు. ఏదో ఆందోళనలో అలా జరిగిపోయింది" అని చెబుతోంది. హంగేరీలో 'ఎన్1 టీవీ'కి కెమెరా పర్సన్ గా ఉన్న పెట్రా ఓ శరణార్థికి కాలు అడ్డు పెట్టగా, ఆ దృశ్యాలు ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పెట్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం విడిచిపెట్టారు. ఘటన అనంతరం ఆమెను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఎన్1 టీవీ యాజమాన్యం ప్రకటించింది. తాను చేసిన పని, ఆపై తనకు జరిగిన నష్టం, ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నాయని, ఆందోళనలో ఉన్న సమయంలో ఓ మంచి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని, వందలాదిగా ప్రజలు తన వైపు దూసుకువస్తుంటే ఎంతో భయపడ్డానని, ఆ సమయంలో తెలీకుండా ఈ ఘటన చోటు చేసుకుందని అంటోంది. తానిప్పుడు నిరుద్యోగిగా ఉన్న మహిళను మాత్రమేనని, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని వారి పోషణ ఎలాగన్న దిగులు పట్టుకుందని చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంలా పెట్రా వాపోతోంది.

  • Loading...

More Telugu News