: నేను టీడీపీలో చేరలేదు... మాట మార్చిన ఎస్పీవై రెడ్డి
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి, ప్రమాణ స్వీకారం చేయకుండానే పార్టీ మార్చిన ఎస్పీవై రెడ్డి ఈ సారి మాట మార్చారు. తన పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అహ్లూవాలియా కమిటీ ఈ విషయంపై విచారణ చేపట్టింది. విచారణకు ఎస్పీవై రెడ్డితో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను టీడీపీలో చేరినట్లు టీవీలు, పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని ఎస్పీవై రెడ్డి కమిటీకి అఫిడవిట్ ఇచ్చారు. తద్వారా తాను పార్టీ మారలేదని ఆయన కమిటీ ముందు వాదించారు. అయితే ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదు చేసిన రాజమోహన్ రెడ్డి కమిటీ ముందు వినిపించే వాదనపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.