: శరణార్థుల ముసుగులో యూరోపియన్ దేశాల్లోకి వేలాది మంది ఉగ్రవాదులు!
ప్రపంచ దేశాలకు, అందునా అగ్రరాజ్యాలుగా పేరున్న బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రభుత్వాలకు షాకింగ్ న్యూస్ ఇది. ఇటీవల సిరియా, ఇరాక్, లెబనాన్ దేశాల నుంచి యూరప్ కు లక్షలాదిగా తరలివస్తున్న శరణార్థుల్లో వేలాది మంది ఉగ్రవాదులు ఉన్నట్టు బ్రిటన్ కు చెందిన 'ఎక్స్ ప్రెస్' పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. వలస వాదుల్లో దాదాపు 4 వేల మంది వరకూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారని, వీరంతా శరణార్థుల రూపంలో వివిధ దేశాల్లోకి ఇప్పటికే చేరిపోయారన్నది ఆ కథనం సారాంశం. అయితే, ఈ వార్తలను గ్రీసు వలస విధాన శాఖ మంత్రి యన్నీస్ మౌజాలస్ కొట్టి పారేశారు. శరణార్థుల్లో ఉగ్రవాదులు ఉన్నారని భావించడం మూర్ఖత్వమే అవుతుందని, ఈ విషయంలో ఎవరైనా ఐఎస్ఐఎస్ ఫైటర్లు యూరప్ లోకి ప్రవేశించారా? అన్న విషయం యూరోపియన్ యూనియన్ ఇంటెలిజన్స్ వర్గాలు తేల్చిచెబుతాయని ఆయన అన్నారు. ఇప్పటివరకూ వలసవాదుల రూపంలో ఉగ్రవాదులు వచ్చినట్టు తమకు ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని, అవన్నీ ఊహాగానాలు కావచ్చని జర్మన్ ఫెడరల్ ఇంటెలిజన్స్ సర్వీస్ అధ్యక్షుడు గెరార్డ్ షిండ్లర్ అభిప్రాయపడ్డారు.