: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు స్వల్ప ఊరట
గుజరాత్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్ లకు స్వల్ప ఊరట లభించింది. నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో సుప్రీంకోర్టు, వారిని అరెస్ట్ చేయకుండా గడువును మరింత పొడిగించింది. వచ్చే నెల 15 వరకు వీరిద్దరినీ అరెస్ట్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. 2002లో చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్లలో గుల్బర్గ్ సొసైటీ బాధితుల స్మారకార్థం మ్యూజియం ఏర్పాటు చేస్తామంటూ సేకరించిన నిధులను... తమ సొంతానికి వాడుకున్నారని వీరిద్దరిపై కేసు నమోదైంది. అంతేకాకుండా, ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి అనుమతులు లేకుండానే నిధులను స్వీకరించారని... ఈ నిధులను మద్యం కోసం, కేశ సౌందర్యం కోసం వాడుకున్నారని ఆరోపిస్తూ గత వారం సెతల్వాద్ నివాసంపై సీబీఐ దాడులు జరిపింది. అయితే, కావాలనే తీస్తా సెతల్వాద్ దంపతులను మోదీ ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.