: ఆరోగ్యం, ఆనందంపై దృష్టి పెట్టండి: ప్రధాని నరేంద్ర మోడీ
ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా ఉండటంతో పాటు అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భవిష్యత్ వైద్యులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ ఉదయం చండీగఢ్ పీజీఐఎంఈఆర్ 34వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందస్తు ఆరోగ్య చర్యల కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. యోగా కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని కూడా ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని, ఫిజియో థెరపిస్టులు యోగా నేర్చుకుంటే వారి పనితీరు మెరుగుపడి మరింతగా రాణిస్తారన్నది తన అభిప్రాయమని మోదీ అన్నారు. టెక్నాలజీతో కూడిన వైద్య విద్యకు నేడు మరింత ప్రాధాన్యత ఉందన్నారు. గతంలో వైద్యులకు సిలబస్ తోనే సంబంధం ఉండేదని, ఇప్పుడు పుస్తకాల కన్నా ఎక్కువగా మనుషుల జీవితాలతో సంబంధం పెరిగిందని, మోదీ అన్న మాటలను విద్యార్థులు చప్పట్లతో స్వాగతించారు. పవిత్రమైన వైద్యసేవ ద్వారా సామాజిక సేవకూ పూనుకోవాలని పాసవుట్స్ కు ప్రధాని మోదీ సూచించారు.