: సచిన్ దత్తత గ్రామంలో పనులను పరిశీలించిన సిబ్బంది
నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగలో జరుగుతున్న పనులపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సిబ్బంది, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదర్శ గ్రామం కింద ఆ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్న తరువాత పలు నిర్మాణాలు మొదలుపెట్టారు. దాంతో అవెలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ముందస్తు సమాచారం లేకుండా ఈ బృందం వచ్చి పరిశీలించారు. అక్కడి సిమెంట్ దారులను చూసి ఆశ్చర్యపోయారట. రహదారులు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటంతో ఇక్కడ శుభ్రం చేయరా? అని స్థానికులను అడిగారు. గ్రామస్థులను కలసి పనులపై ఆరా తీశారు. సచిన్ ఎంపీ నిధులతో ఈ గ్రామంలో క్రీడా మైదానం, సామాజిక భవనం, అంగన్ వాడీ భవనం, భోజనశాల, గ్రామచెరువు ఆధునికీకరణ తదితర పనులు జరుగుతున్నాయి. వాటిని పరిశీలించి ఫోటోలు తీసుకున్నారు. ఈ నెల 23న జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు కోసం ఆదర్శ గ్రామాల అభివృద్ధి చిత్ర సమర్పణ జరగనుంది. ఇందులో భాగంగానే వారు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది.