: చిన్నారి అయిలాన్ కుర్దీని ఐఎస్ఐఎస్ ఎలా ఉపయోగించుకుంటోందో తెలుసా?
చేయని తప్పుకు ప్రాణాలు వదిలి, ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసి, యూరోపియన్ దేశాలకు శరణార్థులపై జాలి, దయలను పెంచిన మూడేళ్ల అయిలాన్ కుర్దీని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కూడా వాడుకుంటోంది. సముద్ర తీరంలో విగత జీవుడిగా పడివున్న కుర్దీ చిత్రాన్ని ఇస్లామిక్ స్టేట్ ఇంగ్లీష్ మేగజైన్ 'దబీక్'లో ప్రచురించింది. 11వ ఎడిషన్ గా వెల్లడైన ఈ మేగజైన్ లో కుర్దీ చిత్రాన్ని చూపుతూ, ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానించింది. శత్రువుల భూభాగంలో తలదాచుకోవాలని వెళితే, అది క్షమార్హమైన నేరమని, ఇటువంటి శిక్షలే పడతాయని ఉపమానాలు చెప్పింది. "షరీయా నీడన ఎదగాల్సిన వారు దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది సిరియన్లు, లెబనాన్లు వారి ప్రాణాలు పణంగా పెట్టి, తమ పిల్లలతో దేశాలు వీడుతూ, భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు. వారి ప్రమాదకర ప్రయాణాలు దేవుడికి కోపం కలిగిస్తున్నాయి. దానికి శిక్షను కూడా అనుభవిస్తున్నారు" అని తెలిపింది. స్వచ్ఛందంగా దేశం వీడి, క్రిస్టియన్ మతం తీసుకోవడం ఓ పెద్ద పాపం అని వ్యాఖ్యానించింది. కుర్దీ చిత్రంతో పాటు ఇటీవల తాము ఆక్రమించుకున్న 2 వేల ఏళ్ల నాటి పురాతన బెల్ దేవాలయం చిత్రాలను కూడా 'దబీక్'లో ఐఎస్ఐఎస్ ప్రచురించింది.