: ఆడపిల్లలూ... బయటకు వెళ్లేటప్పుడు కారంపొడి తీసుకెళ్లెండి: మహిళా ఏఎస్పీ సూచన
పోకిరీల ఆగడాలు, ఆకతాయిల వెకిలి చేష్టలు పెచ్చుమీరడంతో మహిళలు తమను తాము రక్షించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఆడపిల్లలు తప్పనిసరిగా తమను కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా తాండూరు ఏఎస్పీ చందనదీప్తి చెబుతున్నారు. బయటకు వెళ్లేందుకు భయపడొద్దని, ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారి భరతం పట్టాలని చెప్పారు. అందుకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పోకిరీల ఆటకట్టించొచ్చన్నారు. బయటకు వెళ్లేముందు ఆడపిల్లలు తప్పనిసరిగా తమతో కారంపొడి తీసుకెళ్లాలని సూచించారు. ఇటువంటివి దగ్గర ఉంచుకుంటే ఆకతాయిల నుంచి రక్షించుకునే వీలుందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా టీజ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యాంటీ ర్యాంగింగ్ కార్యక్రమానికి ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోకిరీలకు మొదటిసారి కౌన్సెలింగ్ ఇస్తామని, తర్వాత మారకుంటే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు బాలికలు, మహిళలను తోబుట్టువులుగా భావించాలని కోరారు. అన్ని ప్రదేశాల్లో పోలీసులను మఫ్టీలో ఉంచి స్పై కెమెరాలతో నిఘా పెడతామన్నారు.