: ఆర్టీసీ చేసిన ఆ తప్పు, రూ. 160 కోట్ల కొత్త అప్పును నెత్తినేసింది!
అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకొని వున్న ఆర్టీసీపై గతంలో చేసిన తప్పులు కొత్త అప్పులను నెత్తినేశాయి. వివరాల్లోకి వెళితే, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల అత్యవసరాల కోసం సీసీఎస్ (కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ) ఉండగా, వేతనాల బేసిక్ లో 5 శాతం మొత్తాన్ని మినహాయించి సీసీఎస్ కు కలుపుతారు. ఈ నిధులను కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు, చదువులు తదితర ఖర్చులు మీద పడ్డప్పుడు లోన్ రూపంలో తీసుకుని వాడుకుంటుంటారు. ప్రతినెలా తెలంగాణ నుంచి రూ. 26 కోట్లు, ఏపీ నుంచి రూ. 33 కోట్లు ఈ నిధిలో జమ అవుతుంది. అయితే, కార్మికుల సంక్షేమం కోసం వాడాల్సిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా నడిచిన ఆర్టీసీ స్వాహా చేసింది. టీఎస్ ఆర్టీసీ నుంచి రూ. 60 కోట్లకు పైగా, ఏపీఎస్ ఆర్టీసీ నుంచి రూ. 50 కోట్లకు పైగా సీసీఎస్ కు బకాయి పడ్డాయి. ఇక, తమ అవసరాల నిమిత్తం సీసీఎస్ నిధుల నుంచి డబ్బివ్వాలని కార్మికులు పెట్టుకున్న దరఖాస్తులు దాదాపు 10 వేల వరకూ పెండింగ్ లో ఉన్నాయి. కార్మికులు గగ్గోలు పెడుతుండటంతో, ఆప్కాబ్ నుంచి రూ. 160 కోట్ల కొత్త అప్పులు చేసింది. ఈ డబ్బుతో ఇప్పుడు కార్మికుల అవసరాలను తీర్చే పని మొదలు పెట్టింది. ఉన్న నిధులను వాడుకుని, ఆపై కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితిని తెచ్చుకోవడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి.