: టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్?.. ప్రమోషన్ వచ్చేసిందంటున్న నేతలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కు ప్రమోషన్ వచ్చేసినట్లేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన లోకేశ్, పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త హోదాలో నిత్యం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉంటున్న ఆయన మరింత చురుగ్గా పనిచేయడం ప్రారంభించారు. ఎన్నికల అనంతరం ముగిసిన పార్టీ సభ్యత్వ నమోదులో అన్నీ తానై వ్యవహరించిన లోకేశ్, 50 లక్షల మంది సభ్యత్వమున్న పార్టీగా టీడీపీకి సరికొత్త రికార్డు సాధించిపెట్టారు. ఈ క్రమంలో లోకేశ్ కు పార్టీలో మరింత కీలక బాధ్యత అప్పగించాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి ఏపీ, తెలంగాణలకు రెండు కమిటీలతో పాటు కేంద్ర కమిటీని ఏర్పాటు చేయాలని మొన్నటి మహానాడులో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్ర కమిటీలో మూడు ప్రధాన కార్యదర్శి పదవులు ఉండే అవకాశముంది. వీటిలో ఒకటి ఏపీకి చెందిన నేతకు, మరో పదవిని తెలంగాణకు కేటాయించనుండగా, రెండు రాష్ట్రాలకు చెందిన నేతకు మూడో ప్రధాన కార్యదర్శి పదవి దక్కనుంది. ఈ పదవికి లోకేశ్ ను ఎంపిక చేయాలన్న డిమాండ్ కు చంద్రబాబు కూడా సరేనన్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.