: నిన్న చంద్రబాబు పెళ్లి రోజు... విషెస్ చెప్పేందుకు పోటీపడ్డ అమాత్యులు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు పెళ్లి చేసుకుని నిన్నటికి 35 ఏళ్లు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన చంద్రబాబు రాజకీయ రంగప్రవేశం చేశారు. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు, తొలిసారి ఎమ్మెల్యే పదవితోనే మంత్రి పదవిని సైతం కైవసం చేసుకున్నారు. నాటి ఏపీ సీఎం అంజయ్య కేబినెట్ లో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో తెలుగు చిత్రసీమలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న దివంగత నందమూరి తారకరావురావు, చంద్రబాబును అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. తన రెండో కూతురైన భువనేశ్వరిని చంద్రబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. సంబంధం కుదిరింది. 1980, సెప్టెంబర్ 10న చెన్నైలో చంద్రబాబు, భువనేశ్వరిల వివాహం ఘనంగా జరిగింది. నిన్న చంద్రబాబు మ్యారేజ్ డే. అయినా, ఏమాత్రం విశ్రమించకుండా తోటపల్లి ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు చంద్రబాబు విజయనగరం జిల్లాకు వెళ్లారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వెంకన్నను దర్శించుకున్న ఆయన అక్కడ కొత్తగా ఏర్పాటు కానున్న ఓ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబుకు మ్యారేజ్ డే విషెస్ చెప్పేందుకు ఆయన మంత్రివర్గ సహచరులు పోటీలు పడ్డారు. చంద్రబాబును కలవలేని మంత్రులు ఫోన్ లో ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా.. మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత మాత్రం వేదికపైనే చంద్రబాబుకు మ్యారేజ్ డే శుభాకాంక్షలు చెప్పారు.