: తూర్పుగోదావరి జిల్లాలో దళితులను వెలివేసిన గ్రామం
భారతదేశం సాంకేతికంగా ఆధునికత వైపు ఎన్ని అడుగులేసినా అస్పృశ్యతను రూపుమాపడంలో మాత్రం విజయం సాధించలేకపోతోంది. అందుకు తాజా నిదర్శనం ఇదిగో... తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లోని పిండిగొయ్యి గ్రామంలో మూడు సామాజిక వర్గాల మధ్య రేగిన వివాదం దళితులను వెలివేసేందుకు కారణమైంది. దళిత సామాజిక వర్గానికి చెందిన స్థలంలో దేవాలయం నిర్మించేందుకు రెండు సామాజిక వర్గాలు నిర్ణయించి, నిర్మాణం చేపట్టాయి. దీనిని దళితులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన రెండు సామాజిక వర్గాల వారు అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పెకలించి తుప్పల్లో పడేశారు. దీనిపై దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన రెండు సామాజిక వర్గాల పెద్దలు దళితులను వెలివేస్తున్నట్టు ప్రకటించారు. తమ ఆదేశాలు పాటించని వారు పదివేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. దీంతో వివాదం మరింత రాజుకుంది.