: ధోనీ విషయంలో ఆ సూక్తి నిజమవుతోందా?


చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ... అన్న సూక్తి ధోనీ విషయంలో నిజమవుతోందా? అంటే అవుననే చెబుతున్నారు క్రీడా పండితులు. మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన సమయానికి జూనియర్ గా, ఆటకంటే తన జులపాల జుత్తుతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, యువరాజ్, కుంబ్లే, హర్భజన్ వంటి సీనియర్లు ఉన్నా ధోనీని కెప్టెన్ గా ఎంచుకోవడం అప్పట్లో ఆందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ధోనీని కెప్టెన్ గా ఎంచుకున్న తొలి నాళ్లలో సీనియర్లంతా ఒకరకమైన ఆందోళనలో కొనసాగారు. నిర్లక్ష్యానికి గురయ్యారు. అయితే ఆటపై చిత్తశుద్ధి ఉండడంతో విభేదాలు ఉన్నప్పటికీ ఎవరూ బయటకు వ్యక్తీకరించలేదు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు సీనియర్లను పక్కన పెట్టడం ప్రారంభమైంది. నెమ్మదిగా టీమిండియాలో ధోనీ హవా ప్రారంభమైంది. దీంతో ధోనీ ఏం చెబితే అది జరిగేది. కొన్నిసార్లు జట్టు ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి రవీంద్ర జడేజా, సురేష్ రైనా, ఆర్పీ సింగ్ వంటి వారిని ఎంపిక చేసిన ఘట్టాలున్నాయి. ధోనీ సమకాలీనులంతా నెమ్మదిగా ప్రతిభను ప్రదర్శించడంలో విఫలమవుతూ రావడం, అదే క్షణంలో జూనియర్లు సత్తాచాటడంతో టీమిండియాలో కొత్త రక్తం ప్రవహించడం మొదలైంది. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా రవిశాస్త్రిని టీమిండియా డైరెక్టర్ గా నియమించారు. ఇంతలో బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్ మోహన్ దాల్మియా ఎంపికయ్యారు. అంతే ధోనీ ఫేట్ మారిపోయింది. కోహ్లీ కెప్టెన్ గా ఎంపికవ్వడం, జడేజా, రైనా రిజర్వ్ బెంచ్ లేదా 'ఏ' జట్టుకు పరిమితమవ్వడం ప్రారంభమైంది. కోహ్లీ నేరుగా ధోనీకి ఎదురు చెప్పడం ప్రారంభమైంది. భవిష్యత్ కెప్టెన్ కోహ్లీ అని తేలిపోవడంతో ఆటగాళ్లు కోహ్లీ నిర్ణయాలు అమలు చేయడం ప్రారంభించారు. దీంతో ధోనీ అవసరం టీమిండియాకు లేదు అని బీసీసీఐ చెప్పకనే చెబుతోంది. త్వరలోనే సౌతాఫ్రికా సిరీస్ కు ధోనీని ఎంపిక చేయకపోయినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ధోనీ ఫేడ్ అవుట్ కావాల్సిందే. గతంలో సీనియర్లను ఒంటరిని చేసిన ధోనీ ఇప్పుడు సీనియర్ గా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. అందుకే చేసుకున్నోడికి చేసుకున్నంత అని పెద్దలు అన్నారు.

  • Loading...

More Telugu News