: సూపర్ ర్యాలీ... 400 పాయింట్ల భారీ పతనం నుంచి నామమాత్రపు నష్టంలోకి!
ఇటీవలి కాలంలో కనిపించని ర్యాలీ గురువారం నాటి స్టాక్ మార్కెట్ సెషన్లో నమోదైంది. సెషన్ ఆరంభంలో 400 పాయింట్ల నష్టంలో ఉన్న సెన్సెక్స్, యూరప్ మార్కెట్లు అంతంతమాత్రంగా ఉన్నా పుంజుకుంది. కొత్తగా ఈక్విటీల కొనుగోళ్లు జరిగిన ఉత్సాహంతో నష్టాలను పూడ్చుకుంది. పలు కంపెనీల ఈక్విటీలు ఆకర్షణీయమైన ధరలకు లభిస్తుండటమే ఇందుకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఈ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ 97.41 పాయింట్లు పడిపోయి 0.38 శాతం నష్టంతో 25,622.17 వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 30.50 పాయింట్ల నష్టంతో 0.39 శాతం దిగజారి 7,788.10 పాయింట్లకు చేరాయి. ఒకదశలో 25,293 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరిగింది. ఈ ర్యాలీ ప్రభావంతో మిడ్ కాప్ 0.65 శాతం లాభపడింది. టాటా మోటార్స్, టాటా పవర్, బీపీసీఎల్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు లాభాల్లో, ఎన్ఎండీసీ, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి.